Friday, April 10, 2009

ఏప్రిల్ 24.
పరీక్షలైపోయి మూడు రోజులైంది.
దోస్తులు చాలా మంది ఊళ్లకు వెళ్ళి పోయారు.
క్రాంతి కూడా తాతయ్య వాళ్ళ ఊరికి పోతానంటే వాళ్ళ నాన్న ఒప్పుకోలేదు. అమ్మ కూడా నాన్నకే సపోర్టు.
'ఈ పెద్దవాళ్ళు ఎంతసేపు స్కూల్లో ఫస్ట్ రావాలి. మ్యాథ్స్‌లో నూరు మార్కులు రావాలి అంటారు గానీ..' ఆలోచించసాగాడు క్రాంతి.
'నాన్న డ్యూటీకి వెళ్ళాడు. అమ్మ పేరంటానికి వెళ్లింది చెల్లిని వెంట తీసుకుని. వచ్చే లోపు వచ్చేసెయచ్చు..' ఈ ఆలోచన రాగానే బయటపడ్డాడు. గాంధీ పార్కుకి చేరాడు క్రాంతి. అక్కడ గోళీలాడుతున్న పిల్లలతో చేరి, నిమిషాల్లో ఆటలో లీనమైపోయాడు. ఎంతగా లీనమైనాడంటే వీపు మీద వాళ్ళ నాన్న చేతి ముద్రలు పడేదాకా తెలియలేదు.
క్రాంతి వాళ్ల నాన్న చంద్రశేఖర్. బ్యాంకు ఉద్యోగి. పేరులో చంద్రుడున్నా ఎప్పుడూ సూర్యునిలా చిటపటలాడుతూనే ఉంటాడు. అందుకే నాన్నంటే క్రాంతికి భయం. అందుకు తగ్గట్టు ఏదో తప్పు చేస్తూ దొరికిపోతూ ఉంటాడు. ఇంటికి వెళ్ళేటప్పటికి వాళ్ళ మామయ్య శ్రీను కనిపించాడు. ఎప్పుడూ ఐతే సంతోషంగా చుట్టుకునేవాడే కాని ఇప్పుడున్న పరిస్థితిలో పిసరంత నవ్వుతో సరిపెట్టుకోవలసి వచ్చింది. కాళ్ళు చేతులు కడుక్కుని అన్నం తినేందుకు కూర్చున్నాడు బుద్ధిమంతుడిలాగ.
"వీడితో చచ్చే చావొచ్చిందిరా! ఒక్క క్షణం ఏమారితే చాలు ఎక్కడికో పారిపోతాడు..." వడ్డిస్తూ శ్రీనుతో అంది క్రాంతి వాళ్ల అమ్మ భారతి.
అమ్మ తన గురిని అట్లా చెప్పడం బాధ కలిగించింది క్రాంతికి. నోట్లో ముద్ద గొంతు దిగడానికి మొరాయించింది.
"ఫస్ట్ నుండి స్పోకెన్ ఇంగ్లిష్ క్లాసులకి, మ్యాథ్స్ ట్యూషన్‌కి పంపించాలనుకుంటున్నాను. ఈ వెధవ వాటికి కూడా డుమ్మా కొట్టి ఆటలాడేందుకు వెళ్ళేటట్టున్నాడు. ఇట్లా అయితే వీడి మొహానికి ఫస్ట్ క్లాసు సంగతి పక్కన పెట్టు కనీసం పాసైనా అవుతాడా?" అంతెత్తున ఎగిరాడు చంద్రశేఖర్.
"పోనీలే బావా! సెలవులే గదా! నాలుగు రోజులు మావద్ద ఉంటాడు.." ఏదో చెప్పబోయాడు శ్రీను. మామయ్య మాటలు గాయానికి వెన్న రాసుకున్నంత హాయిగా అనిపిస్తున్నాయి క్రాంతికి.
"నీకేమిటోయ్! నువ్వట్లాగే అంటావ్. వేలు వేలు ఖర్చు పెడుతున్నాం తెలుసా. ఈ వెధవ నిర్వాకానికి ఎన్ని ఫీజులు దండగ అవుతున్నాయో, నీకేం తెలుసు. వెధవని ఎక్కడికీ వెళ్ళనిచ్చేది లేదు" చంద్రశేఖర్ మాటల్లో మంట తగ్గలేదు.
అన్నం చేదుగా అనిపించింది క్రాంతికి. సెలవుల్లో అమ్మమ్మ వాళ్ల ఊరికెళ్ళవచ్చని ఎన్నెన్ని కలలుగన్నాడో!
"బావగారూ! మా దగ్గర ఇంగ్లీష్, లెక్కలు చెప్పగలిగే మంచి మాష్టారున్నాడు. క్రాంతిని నావెంట పంపండి. సెలవులు ముగిసే సరికి ఎంత మార్పొస్తుందో చూస్తే మీరే ఆశ్చర్యపోతారు. వచ్చే సంవత్సరం తొమ్మిదో తరగతికి వస్తాడు. అప్పుడు మీరెట్లాగైనా పంపరు. వాడికి ఇదే చివరి అవకాశం గదా...!" ఎన్నో రకాలుగా నచ్చజెప్పాడు శ్రీను.
"ఊ! నీ ఇష్టం.." చంద్రశేఖర్ సీరియస్‌గా అన్నాడు.
అదంతా ఇంకా నమ్మలేనట్లుగానే ఉంది క్రాంతికి.

* * *

చింతకుంట!
మరీ పల్లెటూరు కాకపోయినా ఊరు చిన్నదే. చుట్టూ కొండలు, తాటి చెట్లు, ఇళ్లముందు వసారాలు, బయట అరుగులు, కుయ్..కుయ్‌మంటూ తిరిగే కుక్కపిల్లలు, కోళ్లు... కోడి పిల్లలు, ఇంటి చూర్ల మీద కిచకిచలాడే పిచుకలు, పెరట్లో చెట్టు మీది నుంచి కిందకీ, కింద నుంచి పైకీ ఉరుకులాడుతున్న ఉడతలు, నీళ్ళకోసం పరుగులు పెడుతున్న ఆడవాళ్ళు, గొంగళ్లు భుజాన వేసుకుని పశువులను తోలుకెళ్తున్న పెద్దవాళ్ళు, చిన్న చిన్న లేగదూడలు..., బుజ్జి మేకలు...
కొత్త ప్రపంచంలోనికి అడుగు పెట్టినట్లున్నది క్రాంతికి.
ఊరికొచ్చిన రెండో రోజు.
పొద్దున్నే లేచి వీధిలో గోళీలాడుకుంటున్న పిల్లల్ని చూస్తున్నాడు క్రాంతి.
నలుగురు పిల్లలున్నారక్కడ. అతనికంటే కాస్త చిన్నవాళ్లు. చిరిగిన బట్టలతో మట్టి గొట్టుకుని పోయినట్లున్నారు. ఆట మధ్యలో అప్పుడప్పుడూ క్రాంతిని చూస్తున్నారు. ఏవో గుసగుసలాడుతూ నవూకుంటున్నారు.
'ఆహా! స్వేచ్చ అంటే వాళ్లదే' తనను తాను మరచిపోయాడు క్రాంతి.
"ఒరే క్రాంతీ..!" కేకేశాడు శ్రీను, పిట్టగోడ వెనుక నుండి.
ఉలిక్కి పడి లోపలికి వెళ్ళాడు క్రాంతి.
"ఏరా.. తెల్లారిందా? నాన్నేం చెప్పాడో గుర్తుంది కదా!" మెత్తగా మందలించాడు. "వెళ్లి మొహం కడుక్కో" అంటూనే ఏదో పనున్నట్లు బయటికి వెళ్లిపోయాడు.
రామేశ్వరం పోయినా శనేశ్వరం తప్పలేదు అన్నట్లయింది క్రాంతి పరిస్థితి. 'హూ! ఇక్కడా ట్యూషన్ల గొడవే' అనుకుంటూ నీరసంగా మొహం కడుక్కోవడానికి సిద్ధమైనాడు.
మొహం కడుక్కొని, స్నానం చేసి, అమ్మమ్మ వేడివేడిగ చేసి ఇచ్చిన జొన్న రొట్టె తిన్నాడు ఏదో ఆకుకూరతో.
అప్పుడే పొలం నుండి వచ్చిన తాతయ్య అడిగాడు క్రాంతిని " ఏరా తాతా! రొట్టె తిన్నావా? అది నువ్వు మీ అమ్మ పెట్టే ఇడ్లీలాగా, దోసెలాగా కమ్మగా ఉందా?" అని. క్రాంతిని వాళ్ల తాతయ్య ముద్దుగా "ఏరా తాతా!" అని పిలుస్తాడు.
"తిన్నాను తాతయ్యా! ఇంత పెద్ద రొట్టె. మొత్తం తినేశా!" సంతోషంగా చెప్పాడు క్రాంతి.
వాడి వరుస చూసి భళ్ళున నవ్వేశాడు తాతయ్య. "ఒక్క రొట్టె తినడం మా గొప్పేమిటిరా? నీ వయసులో నేను మూడు రొట్టెలు తినేవాడిని."
అంతలో శ్రీను ఎవరినో కొత్త వ్యక్తిని వెంట పెట్టుకొచ్చాడు.
"ఒరే క్రాంతి! ఇదిగో ఈ సార్ పేరు రాఘవ. రోజూ వాళ్ళింటికి వెళ్లి చదువుకోవాలి. సార్‌కు నమస్కారం చెయ్యి" శ్రీను గొంతులో ఎప్పుడూ కనిపించే ప్రేమ లేదు.
అంత సేపటి ఆనందం కరిగిపోయింది. యంత్రంలాగా చేతులు జోడించాడు క్రాంతి.
"హాయ్ క్రాంతి!" బుగ్గలు తడిమాడు రాఘవ.
మరు నిమిషం కసాయి వాడి వెంట వెళ్తున్న బుజ్జిమేకలా రాఘవను అనుసరించాడు క్రాంతి, పుస్తకాల సంచితో.

* * *

అది పెద్ద ఇల్లు. ఇంటిముందు చాలా ఖాళీ స్థలం. రకరకాల పూలమొక్కలు. ఒక వైపు విరగబూసిన మామిడి చెట్టుకు అక్కడక్కడా పిందెలు అందంగా ఉన్నాయి.
"సార్.." ఏదో అడగబోయాడు క్రాంతి.
"సార్ కాదు బాబాయ్" సవరించాడు రాఘవ.
ఆశ్చర్యంతో నమ్మలేనట్లు చూశాడు క్రాంతి.
"బాబాయ్! ఇవన్నీ ఏంపూలు?"
"ఇవన్నీ మంచి పూలు." జవాబిచ్చాడు రాఘవ.
అర్థం కాలేదు క్రాంతికి.
"క్రాంతి! పూలైనా, మనుషులైనా రెండే రకాలు. మంచివారు, చెడ్డవారు అని. కాని పూలు పుట్టినప్పటినుండి ఒకే లక్షణం కలిగి ఉంటాయి. మనుషులు అవసరాన్ని బట్టి మంచివాళ్లుగా, చెడ్డవాళ్లుగా మారిపోతుంటారు. కొందరు మాత్రమే ఏపరిస్థిల్లోనైనా మారకుండా మంచివాళ్లుగానే ఉంటారు. వాళ్లనే మహాపురుషులు అంటాం."
ఆశ్చర్యానికి తోడు ఆనందంతో క్రాంతి కళ్ళు మెరిశాయి.
"లోపలికి రా! ఇంట్లో ఇంకా మంచి పూలున్నాయి.."
అక్కడ ఒక అవ్వ వాళ్లకు రెండు చిన్న గిన్నెల్లో ఒక ద్రవం పోసిచ్చింది. రాఘవ అది తాగుతూ పక్కనే మిరప పొడి, ఉప్పు చల్లిన మామిడి ముక్కలను నంజుకుంటున్నాడు.
ఇష్టం లేకున్నా అదేదో రుచి చూడాలని క్రాంతి కూడా అట్లాగే తాగాడు.
"దీన్ని అంబలి అంటారు. కొన్ని చోట్లలో జావ అంటారు. పట్టణాల్లో ఉండేవాళ్లు పాలల్లో కలుపుకునే మాల్టోవాలు, బోర్న్‌వీటాలు కూడా వీటినుండి తయారయ్యేవే. దీని కోసం ఉపయోగించిన గింజలు రాగులు లేదా తైదలు" వివరించాడు రాఘవ.
"ఎంత బాగుందో" అనుకోకుండా ఉండలేకపోయాడు క్రాంతి.
అక్కడి నుండి మరో గదిలోకి వెళ్లారు.
గది నీట్‌గా ఉంది. రెండూ పెద్ద పెద్ద అద్దాల బీరువాలున్నాయి. వాటి నిండా పుస్తకాలు. గోడలనిండా మహాపురుషుల బొమ్మలున్నాయి. వివేకానందస్వామి, శివాజీ, రాణా ప్రతాప్, గాంధీ, నెహ్రూ,సుభాష్ చంద్రబోస్, అంబేద్కర్, వీరేశలింగం పంతులు వంటి కొంతమందిని మాత్రమే గుర్తించగలిగాడు క్రాంతి.
'అవును! ఇంట్లో మంచి పూలున్నాయని చెప్పాడు బాబాయ్...' అనుకుంటూ పూలకోసం వెతకసాగాడు కళ్ళతోనే క్రాంతి.
"ఏంటీ! పూలకోసం చూస్తున్నావా? నువ్వు చూస్తున్నవన్నీ మంచి పూలే. దేశంకోసం, ధర్మం కోసం, సమాజం కోసం తమ జీవితాలను పూజాపుష్పాలుగా సమర్పించిన వీళ్లందరూ మంచి పూలే. ఒకప్పుడు నీలా ఆడుకుంటూ, పాడుకుంటూ అల్లరి చేసినవాళ్ళే. వీళ్ళగురించి తెలుసుకోవాలని ఉందా?"
"ఆ!"అన్నాడు క్రాంతి వెంటనే.
"సరే! అవకాశాన్ని బట్టి అన్నీ చెబుతాను. భోజనం టైం అయ్యింది కదా" అన్నాడు రాఘవ.
'ఏంటీ అప్పుడే మధ్యాహ్నమయ్యిందా? బడిలో పన్నెండున్నర అవటానికి ఎంతో ఎదురు చూడవలసి వచ్చేది...'అనుకుంటూ టేబుల్ మీదున్న వాచ్ వంక చూశాడు. ఒంటిగంట! 'అమ్మో!'అనుకుంటూ "మరి పాఠాలు?" అడిగాడు క్రాంతి.
"ఈ రోజు పాఠం అయిపోయింది గదా?" అనేశాడు రాఘవ.నమ్మలేకుండా చూశాడు క్రాంతి.
"పాఠమంటే చదవటం, రాయటం,లెక్కలు చేయటం మాత్రమే కాదు క్రాంతి! తెలియని విషయాలను తెలుసుకునేదంతా పాఠమే. ఈరోజు మీ అమ్మమ్మ వాళ్లింట్లో తిను. రేపటి నుండి ఇక్కడే నీ భోజనం..." చెప్పాడు రాఘవ.
విచిత్రమైన థ్రిల్లింగ్‌తో అక్కడి నుండి బయటకొస్తుంటే "ఆ పుస్తకాలెందుకు? అక్కడికీ ఇక్కడికీ మొయ్యడం ఎందుకు? ఇక్కడనే పెట్టేసెయ్!"అన్నాడు మళ్లీ.
అట్లా మొదలైన క్రాంతి వేసవి బడి రాఘవ వాళ్ల ఇంట్లో సరదాసరదాగా సాగిపోతున్నది.
పుస్తకాలు లేకుండా చదువు చెప్పే ఈ పద్ధతి క్రాంతికి బాగా నచ్చింది. కథలు చెబుతూ, జోకులేస్తూ, చర్చిస్తూ ఎన్నో విషయాలు రాఘవ చెప్పేవాడు. లెక్కలు మాత్రం బుక్కులో చేసుకోవడం. అది కూడా ఎంతో ఇంట్రెస్టింగ్‌గా ఉండేది. ఒక వారం గడిచి ఉంటుంది.
"కొంచెం సేపు గోళీలాడుకుందామా?" అడిగాడు రాఘవ.
'తన గోళీలాట సంగతి బాబాయ్‌తో కూడా చెప్పినట్లున్నాడు మామయ్య...హు!' అనుకుంటూ తలవంచుకున్నాడు క్రాంతి.
"పోనీ, నీకు ఏ ఆట ఇష్టం?" ముద్దుగా చూస్తూ అన్నాడు రాఘవ.
"క్రికెట్!" టక్కున జవాబిచ్చాడు క్రాంతి.
"ఇంకా?"
"క్రికెట్!"
"క్రికెట్‌తో పాటు?"
"క్రికెట్!"
పగలబడి నవ్వేశాడు రాఘవ.
"బౌలింగ్ చేస్తావా?"
"ఓ!"
"ఏం బౌలింగ్?"
"ఫాస్ట్ బౌలింగ్ - శ్రీశాంత్ లాగా!" చేయి తిప్పుతూ చెప్పాడు క్రాంతి.
"సరే! నీకో మంచి కోచ్‌ని పరిచయం చేస్తాను. కానీ ఒక్క కండీషన్. నువ్వు రోజూ ఉదయం ఎప్పటిలాగే ఇక్కడ చదువుకోవాలి. సాయంత్రం ఆటాడేందుకు వెళ్లాలి."
"అలాగే!" చటుక్కున అన్నాడు క్రాంతి.

* * *

అతని పేరు కృష్ణస్వామి.
అందరూ 'స్వామి' అని పిలుస్తారు. పెరిగిన గడ్డం, విరిగిన చేయి మినహాయిస్తే, సినిమా హీరోలా ఉంటాడు. క్రాంతి రాఘవతో కలిసి గ్రౌండ్‌కు వెళ్లేటప్పటికి ఒంటిచేత్తో బ్యాటింగ్ చేస్తూ పిల్లలను పరేషాన్ చేస్తున్నాడు. రాఘవను చూసి ఆట ఆపేసి వచ్చి మాట్లాడాడు.
"నేను చెప్పాను గదా! ఇతనే కృష్ణస్వామి. హైదరాబాదు నుండి రంజీట్రోఫీలో ఆడాడు. యాక్సిడెంట్‌లో చేయి పోగొట్టుకున్నా, ఆట మీద మోజు మాత్రం వదలలేదు. ద్రోణాచార్య అవార్డుకు తగినవాడు."
నమస్కరించాడు క్రాంతి.
"వీడు చిట్టి శ్రీశాంత్. పేరు క్రాంతి. ఈరోజు నుండి రోజూ సాయంత్రం నీవద్ద కొస్తాడు. మాంచి పవరుంది.దాన్ని మంచిగా మలచడం నీ చేతుల్లో ఉంది" క్రాంతిని పరిచయం చేశాడు రాఘవ.
"ఓకే.మిగతాదంతా నాకొదిలేసెయ్.."అంటూ "ఒరే రవీ! మీ టీంలోకి ఫాస్ట్ బౌలర్ వచ్చాడు. కమాన్ వెల్‌కం హిం!" పిల్లలవైపు తిరిగి అరిచాడు.
చప్పట్లతో, కేరింతలతో క్రాంతిని ఆహ్వానించారు అందరూ.
ఆనందం, సిగ్గు, జంకులతో మెల్లగా కదిలాడు క్రాంతి.
కృష్ణస్వామితో పరిచయం అయిన తర్వాత క్రాంతికి సమయమే తెలియడం లేదు. ఉదయం రాఘవ వాళ్ళింట్లో చదువు, సాయంత్రం కృష్ణస్వామి వద్ద క్రికెట్. అంతవరకూ గుడ్డిగా వికెట్లమీదకి విసిరే క్రాంతి, ఆ పదిహేను రోజుల్లో చాలా విషయాలు తెలుసుకున్నాడు. ఏ ఆటకైనా శారీరకంగా 'ఫిట్'గా ఉండటం ఎంత అవసరమో గ్రహించాడు. వ్యాయామం, యోగా కూడా నేర్చుకోవడం మొదలు పెట్టాడు. అతని బౌలింగ్ చూసి అంతా అతనికి 'శ్రీ' అనే ముద్దుపేరు తగిలించేశారు. బౌలింగ్‌లోనే కాక బ్యాటింగ్‌లోనూ ప్రతాపం చూపించసాగాడు క్రాంతి.
ఆరోజు కొంచెం ముందుగానే ప్రాక్టీసు మొదలుపెట్టారు. కాని, ఆట మొదలీన అరగంటకే బంతి ఓపెన్ బోరుబావిలో పడిపోయింది. ఎంత ప్రయత్నించినా ఇంకొక బంతిని తెచ్చుకోలేక పోయారు. ఆ పొలం యజమానిని తిట్టుకుంటూ బోరుబావినైతే మూసేశారు గానీ ఆట మాత్రం ఆగిపోయింది.చాలామంది నిరాశతో ఇంటికెళ్లిపోయారు. క్రాంతికి బాగా దగ్గరైన నానిగాడు,ఆరిఫ్,రవి మాత్రం మిగిలారు. అంతలో దూరాన చంద్రం ఒక పిల్లాడిని వెంటబెట్టుకుని రావడం చూశాడు కృష్ణస్వామి. చంద్రం చేతిలో ఒక సంచి ఉంది. అతని భుజం మీద పొడవైన బెత్తాలవంటి కర్రలు ఉన్నాయి. ఆ పిల్లాడి భుజం మీద కూడా రెండు. పరిశీలించి చూస్తే అవి చేపలు పట్టే గాలాలని తెలుస్తూంది.
"క్రాంతీ! ఏరోజు ఒక కొత్త ఆటాడదాం." అన్నాడు కృష్ణస్వామి."మీరంతా వెళ్లండిరా!"మిగతావాళ్లని పంపించేశాడు.
నానిగాడు మాత్రం క్రాంతితో పాటే ఉందిపోయాడు.
ముగ్గురూ కలిసి చంద్రం వాళ్లకు ఎదురు వెళ్ళారు.
"చంద్రం ఈరోజు మమ్మల్ని కూడా నీతోపాటు చెరువుకి తీసుకుపోతావా?" అడిగాడు కృష్ణస్వామి.
"దాందేం భాగ్యం? రండి తమ్ముడూ!" సంతోషంగా ఆహ్వానించాడు చంద్రం.
తామిప్పుడు గాలాలతో చేపలు పట్టేందుకు వెళ్తున్నామని, వాటిని ఎట్లా ఉపయోగిస్తారో వివరంగా చెపాడు కృష్ణస్వామి దారిలో.తలుచుకుంటేనే విచిత్రమైన అనుభూతికి లోనయ్యాడు క్రాంతి.
పదిహేను నిమిషాల్లో ఊరికి కొంచెం దూరంలో ఉన్న చిన్న చెరువు దగ్గరకు చేరుకున్నారు. చంద్రం తన చేతి సంచిలోనున్న చిన్న కవర్‌లో నుంచి వానపాముని తీసి గాలానికి గుచ్చాడు. అతనితో పాటే వెంట ఉన్న చిన్నోడు ఆ పని చేశాడు. క్రాంతికి కూడా ఒక గాలానికి వానపాము గుచ్చి ఇచ్చి నీళ్లలో తమలాగే వేయమన్నాడు చంద్రం.
కృష్ణస్వామి, నానిగాడు మాత్రం గట్టుమీద వీళ్లకు కొంచెం దూరంగా చూస్తూ కూర్చున్నారు.
పూర్తి ఏకాగ్రతతో, నిశ్శబ్దంగా నీటిమీద ఉన్న తమ తమ బెండ్లనే గమనిస్తున్నారు ముగ్గురూ. ఇంతలో-
'ఝ..ష్! తుపుక్కు'మనే శబ్దం వినిపించింది. అందరూ అటు వైపు చూశారు. చిన్నోడు ఓ చేపను పడేశాడు.
సరిగ్గా అప్పుడే క్రాంతి గాలానికున్న బెండు కదలసాగింది. ఆతర్వాత ఆ బెండు చుట్టూ గుప్పెడు బుడగలొచ్చాయి. అంతలోనే బెండు నెమ్మదిగా నీళ్లలోకి మునిగిపోసాగింది. ఇంక ఆలస్యం చేయకుండా బయటికి లాగాడు.
అద్భుతం!
నల్లటి చేప బయటికొచ్చేసింది. అది కొర్రమీను పిల్ల. డాన్స్ చెయ్యాన్నంత ఆనందం కలిగింది క్రాంతికి. కాని శబ్దం చేయకూడదన్న మాట గుర్తుకొచ్చి ఆగిపోయాడు. ఎంత అణుచుకుందామనుకున్నా ఆగని సంతోషం ఏవో వెర్రికేకల రూపంలో బయటపడింది.

* * *

"ఏమిట్రా ఈ వేళప్పుడొచ్చావ్? క్రికెట్ లేదా?" సాయంత్రం నాలుగ్గంటలప్పుడు కనిపించిన క్రాంతిని అడిగాడు రాఘవ.
"ఈరోజే కాదు. నాలుగు రోజుల దాకా ఏ ఆటలూ లేవు" సీరియస్‌గా అన్నాడు క్రాంతి.
"ఏం ఎందుకు?"
"శ్రీహర్షతో పద్యాల పోటీ!"
"హఠాత్తుగా ఈ పోటీ ఎక్కడి నుండి పుట్టుకొచ్చిందిరా?" ఆశ్చర్యంగా అడిగాడు ఆయన.
"ఈరోజు క్రికెట్‌లో నా బౌలింగ్‌లో మూడుసార్లు డకౌట్ అయ్యాడు వాడు. దమ్ముంటే నాతో పద్యాల్లో గెలవమన్నాడు.'సరే'అన్నాను. అవి మా పుస్తకాల్లోని పద్యాలు కాకుండా వేరె గ్రంథాల్లొవి ఉండాలి అన్నాడు. అందుకూ ఒప్పుకున్నాను మీ మీద నమ్మకంతో" వివరించాడు.
"భలే వాడివే. నువ్వు గెలవడానికి నా మీద నమ్మకం ఎందుకురా?"
"అదంతే!" అన్నాడు ఏం చెప్పాలో, ఎట్లా వివరించాలో తోచలేదు క్రాంతికి. బాబాయ్ చెబితే ఏదైనా నేర్చుకోవచ్చునని అతని నమ్మకం.
"ఇంతకూ ఏ గ్రంథంలోని పద్యాలు? ఎన్ని?"ఆలోచిస్తూ అడిగాడు రాఘవ.
"భాగవతం నుండి పన్నెండు పద్యాలు" చెప్పాడు క్రాంతి.
"ఊరికే కంఠస్థం చేస్తే చాలా?"
"కాదు. అర్థం, భావం చెప్పాలి."
"ఊ!.. నీవు సిద్ధమైతే నేను సిద్ధమే" అనేశాడు రాఘవ.

* * *

రేపే పద్యాల పోటీ.
పద్యాలన్నీ నేర్చుకున్నాడు క్రాంతి.
తప్పకుండా గెలుస్తానన్న విశ్వాసంతో ఉన్నాడు. మరో పక్క శ్రీహర్ష కూడా పట్టుదలతో ప్రాక్టీసు చేస్తున్నాడు.
'తాతయ్యకు పద్యాలంటే చాలా ఇష్టం. కృష్ణ రాయబారం,గయోపాఖ్యానం,రుక్మిణీ కల్యాణం,దక్ష యజ్ఞం అంటూ పేర్లు చెప్పి తన పద్యాలన్నీ వినిపిస్తుంటాడు. తన పద్యాలన్నీ ఇప్పుడు వినిపించేయాలి' అనుకుంటూ రాత్రి పొలం కాపలా కోసం వెళ్లిన తాతయ్య కోసం ఎదురుచూస్తూ కూర్చున్నాడు క్రాంతి. అంతలో వచ్చాడు... నానిగాడు "ఈతకొట్టేందుకు వెళ్దాం రా అన్నయ్యా!"అంటూ.
"ఈ రోజుకి వద్దులేరా..!" బుజ్జగింపుగా అన్నాడు క్రాంతి మనసులో 'వెళ్తే బాగుండేది' అనిపిస్తున్నా.
"ఇంకా నువ్వుండేది మూడు రోజులే గదా? తొందరగా వచ్చేద్దాం..రా" బతిమాలాడు నానిగాడు.
'అప్పుడే సెలవులు దగ్గర పడ్డాయా?'అనుకుంటే దిగులేసింది. ఇంకేమీ ఆలోచించకుండా వాడి వెంట బయలుదేరాడు.దారిలో అరుణ్, రవి కూడా కలిశారు.

* * *

గంటలో వచ్చేద్దామని బావికెళ్లిన వాళ్లు రెండుగంటలైనా అక్కడి నుండి కదలలేదు.
హఠాత్తుగా రేపటి పోటీ కోసం తయారు కావాలని గుర్తుకొచ్చింది క్రాంతికి.
"ఒరేయ్ నాని! ఇంక వెళ్దాం. పొద్దెంతైందో చూశావా?" హెచ్చరించాడు నానిగాణ్ని.
రవి, అరుణ్ కూడా బయటికొచ్చి బట్టలు మార్చుకునేందుకు సిద్ధమైనారు.
"ప్లీజ్ అన్నయ్యా! ఈ ఒక్కసారి పై మెట్టు మీద నుంచి దూకుతా!" అడిగాడు నానిగాడు.
వాడేమడిగినా కాదనడానికి మనసొప్పదు క్రాంతికి."సరే! ఇదే లాస్ట్ కానీయ్! నేను బట్టలు మార్చుకుంటున్నా!" అన్నాడు.
ఈత నేర్చుకునే కొత్తలో అట్లాగే ఉంటుంది. వచ్చేంతవరకూ భయం.వస్తుందన్న నమ్మకం కలగగానే నీళ్లను వదల బుద్ధి కాదు.కొంచెం కొంచెం ఈదడం రాగానే ఒక్కో మెట్టు ఎక్కి దూకడం.
"ఓకే.!" సంతోషంగా అరుస్తూ, ఎనిమిదో మెట్టూ పైకెక్కి గభాల్న దూకేశాడు నానిగాడు. కాని అప్పటికే వాని నడుముకున్న ట్యూబ్ ఊడిపోయే స్థితిలో ఉన్నదని చూసుకోలేదు వాడు.క్రంతి, అరుణ్, రవిలకు ఏం జరుగుతున్నదో వెంటనే అర్థం కాలేదు.అర్థం చేసుకొనేటప్పటికి ట్యూబ్ నీళ్ల మీద ఉంది. నానిగాడు లోపలికెళ్లి పోయాడు. గుండె ఝల్లుమంది క్రాంతికి.
ఈలోపు నానిగాడు మరోసారి... మరోసారి... పైదాకా వచ్చి మునిగిపోయాడు.
క్షణాలు గడుస్తున్నాయి.నానిగాడు మునిగిన చోట గుత్తులు గుత్తులుగా బుడగలు వస్తున్నాయి. మరేమీ ఆలోచించకుండా గభాల్న నీళ్లలోకి దూకేశాడు క్రాంతి.లోపల నీటి అడుగున నల్లగా, భయంకరంగా ఏదో కనిపిస్తున్నది.అది నానిగాడి జుట్టేనని అర్థమయ్యింది. గబుక్కున దాన్ని అందుకుని పైకొచ్చేశాడు.
మెట్ల వద్ద రవి, అరుణ్ చేయందించి, ఇద్దరినీ బయటకు లాక్కున్నారు.
పొట్టమీద నొక్కితే నీళ్లు కక్కేశాడు.అరికాళ్లు, అరచేతులు బాగా రుద్దారు. మెల్లగా కళ్లు తెరిచాడు వాడు.
ఈ సంగతి ఎవరికీ చెప్పకూడదని నలుగురూ కూడబలుక్కుని, ఇళ్లకు చేరుకున్నారు.
'ఎందుకింత ఆలస్యం అయ్యిందిరా?'మందలిస్తూనే క్రాంతికి అమ్మమ్మ భోజనం వడ్డించింది.

* * *

శనివారం సాయంత్రం.
ఆంజనేయ స్వామి ఆలయం కిటకిటలాడుతోంది.
ఎప్పుడూఅ గుడికి వెళ్లని వాళ్లు కూడా ఆరోజు పిల్లల ప్రతిభ చూద్దామని ఆరోజు అక్కడికి చేరుకున్నారు.
న్యాయ నిర్ణేతలుగా మధుసూధన శాస్త్రి, అగ్నివేశ్,సయ్యద్ అమీముద్దీన్ కూర్చున్నారు.
మధుసూధన శాస్త్రి నియమాలు వివరించాడు. మధ్యలో ఆగిపోవడం గానీ,తత్తర పడటంగానీ ఉండకూడదని, భావయుక్తంగా, స్పష్టంగా చదవాలని, అన్ని పద్యాలు ఇద్దరూ సమానంగా చదివినా, చదివిన విధానాన్ని బట్టి ఫలితం చెప్పడం జరుగుతుందని చెప్పాడు. కార్యక్రమాన్ని ప్రారంభించ వలసినదిగా అమీముద్దీన్‌ని కోరాడు.
ఆయన 'శుక్లాంబరధరం...' అంటూ ప్రారంభించగానే అందరూ ఆశ్చర్యపోయారు. ఆయన గొంతులో ఘంటసాల పీఠం వేసుకున్నట్లే ఉంది. చప్పట్లతో అభినందిచారు అంతా.
అగ్నివేశ్ భాగవతంలోని 'అడిగెదనని కడువడి జను'అనే పద్యం చదివి అర్థం వివరించి పద్యం ఇట్లా స్పష్టంగా ఉండాలని తెలిపాడు.
పోటీ ప్రారంభమైంది.
"చేతులారంగ శివుని పూజింపడేని..."అంటూ క్రాంతి చదవగానే అందరూ చప్పట్లు కొట్టారు. నానిగాడు,ఆరిఫ్ గట్టిగా కేరింతలు కొట్టారు.
తర్వాత శ్రీహర్ష 'ఎవ్వనిచే జనించు...'అనే పద్యం చదివి అందరి ప్రశంసలూ అందుకున్నాడు.
ఆ తర్వాత ఇద్దరూ పదేసి పద్యాలు 'నువ్వా-నేనా?' అన్నంత దీటుగా చదివారు. శ్రీహర్ష అంత బాగా చదువుతాడని క్రాంతి ఊహించలేదు. క్రాంతిని ఓడించడం తథ్యమనుకున్న శ్రీహర్షకూ ఓటమి భయం పట్టుకున్నది.
"మీరిద్దరు సమ ఉజ్జీలుగానే ఉన్నారు.ఇప్పుడు మీకిస్టమైన పద్యాన్ని చెప్పండి!" చివరి అవకాశంగా అన్నాడు మధుసూధన శాస్త్రి.
ముందుగా శ్రీహర్ష "ఇంతింతై వటుడింతయై.." పద్యం చదివి వామనుడూ త్రివిక్రముడుగా మారిన వైనాన్ని చక్కగా వివీరించాడు.
ఆలయ ప్రాంగణమంతా చప్పట్లతో మారుమోగింది.
తర్వాత క్రాంతి "కమలాక్షు నర్చించు కరములు కరము.." అంటూ నెమ్మదిగా, అందులో లీనమై భక్తి,జ్ఞానాలు ప్రకాశించేట్లు చదివాడు. అర్థం వివరించనవసరం లేకుండానే ఆగని చప్పట్లు. అర్థం వివరించిన తర్వాత మరిన్ని.
'పోటీలో ఎవరు గెలిచినా బాధలేదు. జీవితంలో ఇంత సంతోషం ఎప్పుడూ పొందలేదు.' లోలోన పొంగిపొసాగాడు క్రాంతి.
'పోటీలో తనే గెలవాలి. లేకపోతే ఎంత అవమానం' కుంగిపోసాగాడు శ్రీహర్ష.
"ఫలితాలు చెప్పేముందు ఒక చిన్న మాట!" 'పాడాలని ఉంది' కార్యక్రమంలో బాలసుబ్రహ్మణ్యంలాగా గొంతు సవరించుకున్నాడు మధుసూధన శాస్త్రి.
"ఇద్దరూ చిచ్చర పిడుగులే! ఇద్దరికీ సమానంగా వచ్చాయి మార్కులు. కాని.."
అందరూ ఊపిరి బిగబట్టి వింటున్నారు.
"శ్రీహర్షలో లేని ఏకాగ్రత క్రాంతిలో ఉంది.."
ఆతర్వాత ఫలితం చెప్పనవసరం లేకపోయింది.
ఆనందంతో చిప్పిల్లాయి క్రాంతి కళ్లు. బాధతో కన్నీళ్లు సుళ్లు తిరిగాయి శ్రీహర్షలో.
భాగవతాన్ని బహుమతిగా ఇచ్చాడు మధుసూధన శాస్త్రి.
"నేనొప్పుకోను. అంతా అన్యాయం!" ఏడుపందుకున్నాడు శ్రీహర్ష.
"తప్పు నాయనా! నువ్వు ఓడిపోలేదు. క్రాంతి నీకంటే మెరుగ్గా రాణించాడు అంతే!" అక్కున చేర్చుకుని మనవణ్ని లాలించాడు మధుసూధన శాస్త్రి.

* * *

మే 30.
మరుసటి రోజే తిరుగు ప్రయాణం కావాలి క్రాంతి.
"హలో క్రాంతి! రేపేనా ప్రయాణం? మళ్లెప్పుడొస్తావురా?" పలకరించాడు ఆరిఫ్.
"రేపు నేను వెళ్లడం లేదుగా!" కళ్లెగరేశాడు క్రాంతి.
"అవునా? అయితే రేపు సీతారాంపేట వాళ్లతో మ్యాచ్ పెట్టుకుందామా?" అడిగాడు వెంటనే ఆరిఫ్.
అప్పటికే మిత్రులందరూ ఏవేవో కానుకలిచ్చారు. ఆరిఫ్ కూడా ఒక బ్యాటు తీసుకొచ్చాడు.
"అయితే ఈ బ్యాటుతో నువ్వు అదరగొట్టేసెయ్యాలి" తను తెచ్చిన బ్యాటును అందించాడు ఆరిఫ్.
"ఇప్పుడింత డబ్బు ఖర్చు చేసి ఎందుకు తెచ్చావురా?" మొహమాట పడుతూ తప్పదన్నట్లు తీసుకున్నాడు క్రాంతి.
మ్యాచ్ విషయం చెప్పడం కోసం మిగతా ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్లారు.
"నాని ఇంటికెళ్దామా?" బయల్దేరదీశాడు క్రాంతి.
"బాబు. క్రాంతి! ఓసారి లోపలికి రా నాయనా?" నాని తల్లి పిలిచింది. ఆమె పేరు సునీత.
"ఏంటి పిన్ని?" అంటూ లోపలికి వెళ్లాడు క్రాంతి.
"క్రాంతి! పెద్దవాడివైతే నీ కాళ్లు కడిగి నెత్తిన చల్లుకునేదాన్నిరా! కానీ నువ్వు నా బిడ్డలాంటివాడివి. నీవే లేకుంటే నా బిడ్డ.." దుఃఖంతో సునీత గొంతు పెగలలేదు.
"అసలే వాడి తండ్రిని పోగొట్టుకున్నాను. వాడు కూడా పోయుంటే..."
ఆమె అట్లా మాట్లాడే సరికి క్రాంతికి కూడా ఏడుపొచ్చేసింది.
"బావి సంగతి ఎవరికీ చెప్పొద్దన్నాను గదరా" తిరిగి వెళ్తూ ఆరా తీశాడు క్రాంతి.
"నేను చెప్పలేదన్నయ్యా! అరుణ్ వాళ్ళమ్మతో చెప్పాడట. ఆమె అమ్మకు చెప్పింది. అమ్మ నన్నడిగితే జరిగింది చెప్పాను." నిజం ఒప్పుకోక తప్పలేదు నానికి.
క్రాంతి చింతకుంటలో గడిపిన రోజులన్నీ చెప్పలేని మధురానుభూతులను మిగిల్చాయి. సంతోషం, బాధ, సాధించిన పనులతో కలిగిన ఆనందం. తల్లి లాంటి ఆ పల్లెను వదిలివెళ్లవలసి వస్తుందన్న విచారం...
రకరకాల భావాలతో ఇంట్లోకి అడుగుపెట్టిన క్రాంతి కొయ్యబారి పోయాడు.
ఎదురుగా నాన్న చంద్రశేఖరం! కుర్చీలో కూర్చుని ఉన్నాడు.
తెలిల్యకుండానే కాళ్లు వణికాయి.
"ఏరా వెళ్దామా?" అడిగాడు ఎప్పటిలాగానే.
నోట మాట రాలేదు క్రాంతికి.
"నీ గురించి అన్నీ తెలిశాయిలే. ఇప్పుడే రానక్కర్లేదు. నాలుగు రోజులాగి రావచ్చు మీ అమ్మ, చెల్లితో సహా!"
తండ్రి ఏం మాట్లాడుతున్నాడో అర్థం కాలేదు వెంటనే క్రాంతికి.
అతని అనుమానాన్ని తొలగిస్తూ లోపలింట్లో నుంచి భారతి ముసిముసి నవ్వుల్తో బయటకు వచ్చింది.
"అన్నయ్య!" అమ్మ కొంగు చాటు నుండి చెల్లి తొంగి చూసింది. "అమ్మ!" రివ్వున పరుగెత్తి తల్లి కౌగిట్లో ఒదిగి పోయాడు క్రాంతి.
[సాక్షి-ఫన్‌డే మే 25, 2008 లో ప్రచురితం.]